ప్రతిపక్షం, జూన్ 12: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత పరాజయం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురైన వైఫల్యమని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె, నామినేషన్ తిరస్కరణ ప్రక్రియలో రాజ్యాంగబద్ధ సంస్థల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సంఘం సభ్యులు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో రాజీ పడ్డారనే అనుమానాలను తాను ముందే వ్యక్తం చేశానని పేర్కొన్నారు. నామినేషన్ తిరస్కరణ అంశంపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినప్పటికీ, 48 గంటల పాటు ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని విమర్శించారు.
అయితే సుప్రీంకోర్టు తమ వాదనలను కనీసం వినిపించుకునే అవకాశం కల్పించిందని, అందుకు న్యాయవ్యవస్థ పట్ల గౌరవం ఉందని మీనాక్షి నటరాజన్ అన్నారు. ఈ వ్యవహారం కేవలం ఒక అభ్యర్థి నామినేషన్‌కు సంబంధించినది కాదని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు సంబంధించిన అంశమని ఆమె స్పష్టం చేశారు.
నామినేషన్ తిరస్కరణ వెనుక జరిగిన పరిణామాలపై పూర్తి స్థాయిలో న్యాయపోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై మరోసారి చర్చ మొదలైంది.

















