సింగరేణి కార్మికులకు శుభవార్త.. యథావిధిగా మెడికల్ బోర్డు, భారీ సంక్షేమ నిర్ణయాలు

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 12: సింగరేణి కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డును యథావిధిగా పునఃప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మెడికల్ బోర్డు వ్యవస్థను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలు, మధ్యవర్తుల జోక్యానికి ఎలాంటి అవకాశం లేకుండా కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా కారుణ్య నియామకాలను వేగవంతం చేస్తున్నట్లు భట్టి తెలిపారు. అర్హులైన వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంచిర్యాలలో 335 మంది వారసులకు నియామక పత్రాలను అందజేయనున్నట్లు వెల్లడించారు.

సింగరేణిలో చాలా కాలంగా కొనసాగుతున్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి న్యాయ నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో మొత్తం 2,657 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 2,102 కారుణ్య నియామకాలు, 555 ప్రత్యక్ష నియామకాలు ఉన్నాయని చెప్పారు. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచడం ద్వారా మరింత మందికి అవకాశం కల్పించినట్లు వివరించారు.

సింగరేణి కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం, 40 వేల మంది ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సదుపాయాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. అదనంగా రూ.10 లక్షల సహజ మరణ బీమా కూడా అందిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా, బోనస్ సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

గత రెండేళ్లలో సింగరేణి కార్మికులకు రూ.1,500 కోట్ల లాభాల వాటాను పంపిణీ చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం సింగరేణి ఆస్పత్రులను ఆధునికీకరిస్తున్నామని, గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కొత్త బొగ్గు గనులను సాధించి మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

సింగరేణి కార్మికుల సంక్షేమం, భద్రత, ఉద్యోగ భరోసా, ఆరోగ్య సేవల మెరుగుదల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కార్మిక వర్గంలో విశ్వాసాన్ని పెంచుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News