ప్రతిపక్షం, జూన్ 12: సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ విమర్శలు మానుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సంక్షేమ శాఖల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో పూర్తిస్థాయి పారదర్శకతతో పాలన సాగుతోందని మంత్రి తెలిపారు. ఈ శాఖలకు సంబంధించిన నిర్ణయాల అమలులో రాజకీయ జోక్యానికి తావు లేకుండా అధికార యంత్రాంగానికే పూర్తి బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని వెల్లడించారు.
హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలు వాస్తవాల కంటే రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నాయని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధానాలనే ఇప్పుడు కూడా జరుగుతున్నాయని భావించి మాట్లాడటం సరైంది కాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా తన రాజకీయ స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
పేదలు, వెనుకబడిన వర్గాల విద్యా అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, ఆహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. సంక్షేమ రంగంలో ప్రతి రూపాయి సరైన లబ్ధిదారుడికి చేరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థ అమలు చేస్తున్నామని చెప్పారు.
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తరఫున కూడా తాను మాట్లాడుతున్నానని పేర్కొన్న పొన్నం ప్రభాకర్, సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని రుజువు చేస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. ప్రజల డబ్బు వినియోగంలో ప్రభుత్వం పారదర్శకత, బాధ్యతాయుత పాలనకు కట్టుబడి ఉందని, నిరాధార ఆరోపణలతో సంక్షేమ కార్యక్రమాలపై అనుమానాలు సృష్టించడం తగదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని రాజకీయాల కంటే ప్రజా సేవగా భావిస్తోందని, పేదల అభ్యున్నతి కోసం చేపడుతున్న కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా అమలు అవుతాయని మంత్రి తెలిపారు. అవినీతి ఆరోపణలపై అవసరమైతే స్వతంత్ర విచారణకూ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ, ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

















