ప్రతిపక్షం, జూన్ 11: ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జలసౌధలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. సీతమ్మసాగర్తో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాలేరు అనుసంధాన కాలువ ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు పాత ఆయకట్టును స్థిరీకరించే చర్యలు చేపడతామని వెల్లడించారు. మున్నేరు–పాలేరు అనుసంధానం పూర్తయితే ఖమ్మం, సూర్యాపేట జిల్లాల రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
విద్యుత్ ఖర్చు లేకుండా గురుత్వాకర్షణ పద్ధతిలో నీటిని మళ్లించే విధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. దీంతో సాగునీటి నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు రైతులకు మరింత లాభం చేకూరుతుందన్నారు.
భద్రాచలం, ఖమ్మం ప్రాంతాల్లో వరద నియంత్రణ, రక్షణ పనులకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రాజెక్టుల పూర్తి కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న మంత్రి, ప్రతి ప్రాజెక్టుకు గడువులు నిర్దేశించి నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.















