అంగన్‌వాడీల్లో 15,982 పోస్టుల భర్తీకి శ్రీకారం

ప్రతిపక్షం, జూన్ 23: తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,982 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నియామకాల కోసం నోటిఫికేషన్లు విడుదల కాగా, త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా ప్రకటనలు వెలువడనున్నాయి.

మల్టీజోన్-1 పరిధిలో 1,853 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 7,737 హెల్పర్ పోస్టులు ఉండగా, మల్టీజోన్-2 పరిధిలో 1,247 టీచర్ పోస్టులు, 5,145 హెల్పర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం కలిపి వేలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు కనీసం ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టనున్నారు.

ఈ నియామకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ నియామక ప్రక్రియ త్వరలోనే పూర్తి స్థాయిలో వేగం అందుకోనుంది.

Spread the love

Related News

Latest News