ప్రతిపక్షం, ఆగస్టు 03: వర్షాకాలంలో తడి దుస్తులు ధరించడం లేదా సరిగా ఆరని బట్టలను ఉపయోగించడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షంలో తడవడం, ఇంట్లో బట్టలు పూర్తిగా ఆరకపోవడం వంటి పరిస్థితుల కారణంగా చాలామంది తడి లేదా తేమ ఉన్న దుస్తులనే ధరిస్తుంటారు. అయితే ఈ అలవాటు చర్మ సంబంధిత వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
తడి దుస్తులు ఎక్కువసేపు శరీరంపై ఉండడం వల్ల చర్మంపై తేమ పెరిగి బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చేతుల మడతలు, కాళ్ల వేళ్ల మధ్య, మెడ, చంకలు వంటి ప్రాంతాల్లో దురద, ఎర్రటి మచ్చలు, చర్మం పొలుసులు ఊడిపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు కనిపించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇలాంటి ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే అవి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఒకే తువాలు, దుస్తులు లేదా వ్యక్తిగత వస్తువులను ఇతర కుటుంబ సభ్యులు ఉపయోగిస్తే వారికి కూడా ఈ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
వర్షంలో తడిసిన వెంటనే పొడి దుస్తులు మార్చుకోవడం, పూర్తిగా ఆరిన బట్టలనే ధరించడం, తడి చెప్పులు, సాక్స్ ఎక్కువసేపు ఉపయోగించకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే బట్టలు పూర్తిగా ఆరనప్పుడు వాటిని ఇస్త్రీ చేసి ధరించడం ద్వారా తేమను కొంతవరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
ఎక్కువసేపు తడి దుస్తులతో ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. కొందరిలో కండరాలు, కీళ్లపై ప్రభావం చూపి నొప్పులు పెరగవచ్చని పేర్కొంటున్నారు.
వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, శరీరాన్ని పొడిగా ఉంచుకోవడం, తడి దుస్తులను వెంటనే మార్చుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మవ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

















