[t4b-ticker]

తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక.. తెలంగాణలో ఎల్లో అలర్ట్, ఏపీలో పిడుగులతో కూడిన వానలు

ప్రతిపక్షం, ఆగస్టు 03: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) విడుదల చేసిన అంచనాల ప్రకారం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.

వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అయితే పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, అధికారుల సూచనలను పాటించాలని సూచించారు.

రానున్న రోజుల్లో కూడా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున తాజా బులెటిన్లను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Spread the love

Related News

Latest News