ప్రతిపక్షం, ఆగస్టు 03: తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారడంతో పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీైంది. క్యుములోనింబస్ (Cumulonimbus) మేఘాల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా, రాత్రి వరకు మరిన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆదిలాబాద్, ఖమ్మం, భూపాలపల్లి, జగిత్యాల, ములుగు, వరంగల్, సూర్యాపేటతో పాటు హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు పోలీసులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. వర్ష తీవ్రత పెరగకముందే తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. నీరు నిలిచిన రహదారులపై వేగంగా ప్రయాణించవద్దని, దృశ్యమానత తగ్గే పరిస్థితుల్లో హెడ్‌లైట్లు ఉపయోగించాలని, విద్యుత్ స్తంభాలు, చెట్లు, మ్యాన్‌హోల్‌ల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎక్కడైనా చెట్లు కూలడం, రోడ్లపై నీరు నిలవడం లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసు లేదా జీహెచ్‌ఎంసీ అత్యవసర సేవలకు సమాచారం అందించాలని కోరారు.
భారీ వర్షాల ప్రభావం రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనిస్తూ, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండటం, భద్రతా జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

















