ప్రతిపక్షం, ఆగస్టు 03: తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకతను మరింత పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మార్వో (MRO), ఆర్డీవో (RDO) కార్యాలయాల్లో ‘భూ భారతి’ పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. గతంలో భూ రికార్డుల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ప్రైవేటు ఆపరేటర్ల స్థానంలో రెవెన్యూ శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్లను నియమించి, భూ భారతి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వ సిబ్బందికే అప్పగించనున్నారు. ఇందుకోసం మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ల వివరాలను వెంటనే పంపించాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కొత్త బాధ్యతలు చేపట్టే ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. భూ రికార్డుల నమోదు, సవరణలు, మ్యూటేషన్లు వంటి ప్రక్రియల్లో పారదర్శకత పెరగడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే మీ సేవ కేంద్రాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు భూ భారతి పోర్టల్ నిర్వహణను పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలోకి తీసుకురావాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నిర్ణయంతో భూ రికార్డుల భద్రత, ఖచ్చితత్వం మెరుగుపడడంతో పాటు ప్రజలకు మరింత విశ్వసనీయమైన సేవలు అందే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

















