ప్రతిపక్షం, ఆగస్టు 04: హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో నిర్వహించిన తాజా సర్వేలో సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్ దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతున్నట్లు జెన్-ఎస్ (Gen-S) సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఆడియో, వీడియో కాల్స్, డేటింగ్ యాప్‌ల వినియోగం కారణంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుమానాలు, గొడవలు పెరుగుతున్నాయని సర్వే పేర్కొంది.
సర్వే ప్రకారం, భార్యాభర్తలు వ్యక్తిగతంగా సమయం గడుపుతున్న సమయంలో తరచూ ఫోన్ కాల్స్ లేదా వీడియో కాల్స్ రావడం, వాటికి స్పందించాల్సి రావడం వల్ల పరస్పర అనుమానాలు పెరుగుతున్నాయి. సమయానికి సంబంధం లేకుండా ఎక్కువసేపు ఫోన్‌లో మాట్లాడటం కూడా దాంపత్య బంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పరిశోధకులు వెల్లడించారు.
అలాగే డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా వేదికల్లో ఇతరులతో తమ భాగస్వామిని పోల్చుకోవడం, అవాస్తవ అంచనాలు పెంచుకోవడం వంటి ధోరణులు సంబంధాల్లో విభేదాలకు దారితీస్తున్నాయని నివేదిక పేర్కొంది.
డిజిటల్ మాధ్యమాల వినియోగంలో పరస్పర నమ్మకం, సమయపాలన, స్పష్టమైన సంభాషణ ఉంటే ఇలాంటి సమస్యలను చాలావరకు నివారించవచ్చని నిపుణులు సూచించారు.

















