ప్రతిపక్షం, ఆగస్టు 04: హైదరాబాద్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే కేవలం ఏడాది వ్యవధిలోనే రూ.470 కోట్ల అప్పును ఎలా తీర్చారో ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే అంత పెద్ద మొత్తంలో ఆర్థిక సామర్థ్యం ఉంటే, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి నాయకుల ఆస్తులు ఎంత ఉంటాయో ప్రజలకు అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా వ్యవహరిస్తే ఆ ఎమ్మెల్యే వివరాలను బహిర్గతం చేయాలని, ఈ అంశంపై సుమోటోగా విచారణకు ఆదేశించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఏలేటి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన ఆరోపణలపై కాంగ్రెస్ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

















