ప్రతిపక్షం, ఆగస్టు 04: తెలంగాణ ప్రభుత్వం కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.50 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులు లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్‌ను అందజేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ విడతలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులను కూడా కొత్తగా పెన్షన్ పథకంలో చేర్చనున్నట్లు సమాచారం. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు రోగులకు ఆర్థిక భరోసా లభించనుంది.
సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


















