ప్రతిపక్షం, ఆగస్టు 05: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తనపై ఆధారాలు లేకుండా క్షుద్ర పూజలు చేశారంటూ చేసిన ఆరోపణలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించారని, తప్పుడు ప్రచారం చేశారని నోటీసులో పేర్కొన్నారు.
అయితే నిర్ణీత గడువులోగా ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే మహేశ్ కుమార్ గౌడ్‌పై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు దాఖలు చేస్తామని హరీశ్‌రావు తరఫు న్యాయవాది హెచ్చరించారు.
ఇటీవల హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపగా, ఇప్పుడు వాటిపై హరీశ్‌రావు లీగల్ నోటీసులు పంపడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

















