ప్రతిపక్షం, ఆగస్టు 05: తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులకు విమానయాన రంగంలో కెరీర్ నిర్మించుకునే అరుదైన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన యువతులను కమర్షియల్ పైలట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి, ఇండిగో రీచ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై’ కార్యక్రమం కింద ఎంపికైన విద్యార్థినులకు పూర్తిగా ఉచితంగా కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) శిక్షణ అందించనున్నారు. శిక్షణలో భాగంగా ATR టైప్ రేటింగ్, నైపుణ్యాభివృద్ధి, మెంటార్షిప్తో పాటు ఉచిత వసతి, భోజనం, వైద్య బీమా సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. మొత్తం శిక్షణ వ్యవధి 20 నెలలుగా ఉండనుంది.
విమానయాన రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పైలట్ కావాలనే కలను నెరవేర్చుకోలేకపోతున్న ప్రతిభావంతులైన విద్యార్థినులకు ప్రోత్సాహం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
అర్హత కలిగిన విద్యార్థినులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులను IndiGo Reach – Giving Wings to Fly అధికారిక దరఖాస్తు పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. ఎంపిక ప్రక్రియ, అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు గడువు తదితర వివరాలు అదే పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ యువతులు అంతర్జాతీయ స్థాయి విమానయాన రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం లభించనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

















