ప్రతిపక్షం, ఆగస్టు 05: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి శస్త్రచికిత్స అనంతరం అత్యంత అరుదైన సమస్య ఎదురైంది. 2024లో నోటిలో ఏర్పడిన చిన్న అల్సర్‌కు చికిత్సలో భాగంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, అప్పటి నుంచి నోటి లోపల వెంట్రుకలు మొలుస్తున్నాయని వెల్లడించారు.
వైద్యుల వివరాల ప్రకారం, శస్త్రచికిత్స సమయంలో గొంతు భాగంలోని చర్మాన్ని నోటి లోపల దెబ్బతిన్న ప్రాంతానికి మార్పిడి (స్కిన్ గ్రాఫ్ట్) చేశారు. అయితే ఆ చర్మంలో ఉన్న హెయిర్ ఫాలికల్స్ కారణంగా నోటి లోపల వెంట్రుకలు పెరిగే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత అరుదుగా కనిపించే శస్త్రచికిత్స అనంతర దుష్ప్రభావంగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
బాధితుడు మాట్లాడుతూ, ఈ సమస్య కారణంగా తినడం, తాగడం, ఆహారం నమలడం చాలా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. శస్త్రచికిత్సకు ముందు ఇలాంటి దుష్ప్రభావాల గురించి వైద్యులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించాడు.
ఈ ఘటన ప్రస్తుతం వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి పరిస్థితులు చాలా అరుదుగా కనిపించినప్పటికీ, శస్త్రచికిత్సకు ముందు రోగులకు అన్ని అవకాశాలు, దుష్ప్రభావాలపై పూర్తి అవగాహన కల్పించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

















