ప్రతిపక్షం, ఆగస్టు 05: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తన రాజకీయ పునరాగమనంపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ నిర్ణయాలపై త్వరలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
తనది స్వతంత్ర భావజాలమని, ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేదా బాహ్య ప్రభావాలకు తాను లోనుకాబోనని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆత్మగౌరవం, పారదర్శకతనే తన నిర్ణయాలకు ప్రాతిపదికగా తీసుకుంటానని పేర్కొన్నారు. నిర్భయంగా, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.
విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్‌తో ఆయన రాజకీయ అడుగులపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
త్వరలో జరగనున్న మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు, ఏ పార్టీతో కలిసి పనిచేయనున్నారనే అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై తన వైఖరిని వెల్లడించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆయన ప్రకటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

















