ప్రతిపక్షం, ఆగస్టు 06, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో ఢిల్లీలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధికి అమెరికా సంస్థలు, విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం పెంచాలని సీఎం కోరారు.
ఉన్నత విద్య కోసం ప్రతి సంవత్సరం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు మరిన్ని వీసాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వీసా ఇంటర్వ్యూ స్లాట్ల సంఖ్యను పెంచాలని, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. దీంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణకు చెందిన ఐటీ, ఇంజినీరింగ్, వైద్య తదితర రంగాల నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సీఎం రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్, రెన్యువల్, వీసా స్టాంపింగ్‌లో జాప్యం లేకుండా సరళమైన విధానాన్ని అమలు చేయాలని కోరారు. వీసా నిబంధనల్లో జరిగే మార్పులపై ముందుగానే స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు.
అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. విద్యార్థులకు అవసరమైన సహాయం అందేలా పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో అమెరికా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రేవంత్ రెడ్డి వివరించారు. ఐటీ, కృత్రిమ మేధ (AI), లైఫ్ సైన్సెస్, ఫార్మా, స్టార్టప్‌లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ రంగాల్లో అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనుకూల వేదికగా నిలుస్తుందని చెప్పారు.
అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణలోని విద్యాసంస్థలతో భాగస్వామ్యం పెంచాలని కూడా సీఎం కోరారు. విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత చరిత్ర, సంస్కృతిపై అమెరికా రాయబారి సెర్జియో గోర్‌కు ఉన్న అవగాహన తనను ఆకట్టుకుందని అన్నారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, రాష్ట్ర ప్రత్యేకతలపై రాయబారి చూపిన ఆసక్తిని అభినందించారు.
సమావేశంలో స్పందించిన అమెరికా రాయబారి సెర్జియో గోర్, తెలంగాణ–అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాలు, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు ప్రాంతాల మధ్య సహకారం మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

















