[t4b-ticker]

హైదరాబాద్‌లో శిశువు కిడ్నాప్ కలకలం..

ప్రతిపక్షం, ఆగస్టు 06, హైదరాబాద్: నగరంలోని బోడుప్పల్‌లో ఎనిమిది నెలల శిశువు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. అయితే పోలీసులు వేగంగా స్పందించి కొన్ని గంటల్లోనే శిశువును సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న మహిళనే నిందితురాలిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, బోడుప్పల్‌లోని ఎన్‌ఐఎన్ కాలనీలో నివసిస్తున్న శివరామ్–స్పందన దంపతులకు వైష్ణవ్ రుద్రాంశ్ (8 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు. దేవరకొండకు చెందిన దుర్గాభవాని (36) ఇటీవల వారి ఇంట్లో హెల్పర్‌గా పని చేయడం ప్రారంభించింది.

బుధవారం మధ్యాహ్నం శిశువును బయటకు తీసుకెళ్లి ఆడిస్తానని చెప్పిన దుర్గాభవాని, బాలుడిని తీసుకుని వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.

సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు కర్మన్‌ఘాట్ ప్రాంతంలో దుర్గాభవానిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి శిశువును సురక్షితంగా స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

ప్రాథమిక విచారణలో దుర్గాభవాని తన రెండు నెలల చిన్నారిని ఇటీవల కోల్పోయిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టినట్లు వెల్లడైంది. ఆ మానసిక వేదనలోనే తాను పనిచేస్తున్న ఇంటి శిశువును తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అపహరణ వెనుక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

శిశువును సకాలంలో గుర్తించి కుటుంబానికి అప్పగించిన పోలీసులను తల్లిదండ్రులు అభినందించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాలిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love

Related News

Latest News