[t4b-ticker]

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిధి విస్తరణ

ప్రతిపక్షం, ఆగస్టు 06: వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ వృత్తులకు ప్రోత్సాహం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) పథకం పరిధిని మరింత విస్తరిస్తూ పశుపోషణ, మత్స్య పరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం వంటి రంగాల్లో పనిచేస్తున్న అర్హులైన రైతులు, పశుపాలకులకు కూడా ఈ పథకం ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

ఈ పథకం ద్వారా లబ్ధిదారులు తక్కువ వడ్డీతో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల కోసం రుణాలు పొందే అవకాశం ఉంటుంది. రైతులు సకాలంలో పెట్టుబడులు సమకూర్చుకుని ఉత్పత్తిని పెంచుకోవడంతో పాటు ఆదాయాన్ని మెరుగుపరచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అందించే రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. అలాగే సాధారణంగా 7 శాతం వడ్డీ ఉండగా, కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీ రాయితీ అందించడం వల్ల సకాలంలో రుణం చెల్లించే రైతులకు కేవలం 4 శాతం వడ్డీకే రుణ సౌకర్యం లభిస్తుంది.

వ్యవసాయంతో పాటు పశుసంవర్థక, మత్స్య, పశుపోషణ రంగాల అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో చిన్న, సన్నకారు రైతులు మరియు అనుబంధ రంగాలపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థికంగా మరింత ఊతం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

Related News

Latest News