ప్రతిపక్షం, ఆగస్టు 06: తమిళనాడు ప్రభుత్వం తన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు కీలక పథకాలకు భారీ నిధులు కేటాయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారిస్తూ మహిళలు, విద్యార్థులు, శిశువులు, మైనారిటీల కోసం పలు కొత్త నిర్ణయాలను ప్రకటించింది.
ఎన్నికల హామీ మేరకు వివాహం చేసుకునే అర్హులైన వధువులకు 8 గ్రాముల బంగారం, పట్టుచీర అందించే పథకానికి రూ.812 కోట్లు కేటాయించింది. మహిళల సంక్షేమం, ఆర్థిక భరోసా లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరం బహుమతిగా అందించేందుకు రూ.560 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి–శిశు సంక్షేమాన్ని మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
విద్యారంగానికీ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసేందుకు రూ.2,000 కోట్లు కేటాయించారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
మైనారిటీల సంక్షేమంలో భాగంగా తొలిసారి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు అందించే సబ్సిడీని రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అదే విధంగా రాష్ట్ర ప్రజలకు మరో కీలక హామీగా ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం గృహ వినియోగదారులకు గణనీయమైన ఊరటనిస్తుందని భావిస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన ఈ సంక్షేమ పథకాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అధికార పార్టీ చెబుతుండగా, ప్రతిపక్షాలు అమలు సాధ్యత, ఆర్థిక భారం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

















