ప్రతిపక్షం, ఆగస్టు 06, హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభలో ఘనంగా నివాళులర్పించారు. శాసనసభ సభ్యుల లాంజ్‌లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, మంత్రి అజహరుద్దీన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా ఆచార్య జయశంకర్ పనిచేశారని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా వినిపిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహనీయుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
తెలంగాణ భావజాలాన్ని సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేయడంలో జయశంకర్ చేసిన సేవలు అమూల్యమని నాయకులు గుర్తుచేశారు. రాష్ట్ర నిర్మాణానికి ఆయన అందించిన ఆలోచనలు, మార్గదర్శకాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి కార్యదర్శులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళులర్పించారు.

















