ప్రతిపక్షం, ఆగస్టు 06: తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ భావజాలంపై నిబద్ధత లేదని, “జై తెలంగాణ” అని చెప్పడానికి కూడా ఆయన మనసు ఒప్పుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కలిసి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలులోకి రాలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన ఏడు సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించడం లేదన్నారు. తెలంగాణ కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవి కావని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఆత్మగౌరవం, రాష్ట్ర హక్కులు, అభివృద్ధిని కాపాడాలంటే మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరమని కేటీఆర్ అన్నారు. ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చి కేసీఆర్ చేతుల్లో రాష్ట్ర పగ్గాలు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లే శక్తి బీఆర్ఎస్‌కే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సాగునీటి హక్కులు, ఉద్యోగాల కల్పన, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో బీఆర్ఎస్‌నే ప్రజలకు ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు.

















