ప్రతిపక్షం, ఆగస్టు 06: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకుడైన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడిగా ఆచార్య జయశంకర్‌ను ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలం చేకూర్చడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వీయ పాలన కోసం ఆచార్య జయశంకర్ చేసిన త్యాగాలు, చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, సమగ్ర సంక్షేమం దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

















