[t4b-ticker]

జలసిరి ని రైతులు వినియోగించుకోవాలి

  • పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి
  • రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 07: వర్షపు నీటి సంరక్షణ కోసం ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు, వ్యవసాయ భూముల్లో ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చేసుకోవాలని, జలసిరి కార్యక్రమాన్ని రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని మంత్రి కోరారు. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ క్యాంటీన్లు, సోలార్ యూనిట్లు, బస్సులు, పెట్రోల్ బంకులు వంటి అనేక ఉపాధి అవకాశాలను మహిళా సంఘాలకు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని వ్యవసాయం, గ్రామీణ మౌలిక వసతులు, మహిళా సాధికారత, పశుసంవర్ధక రంగాల్లో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో శుక్రవారం రూ.2 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తో పాటు ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లిలో రూ.1.56 కోట్లతో వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిపాలన భవనం, ఓపెన్ కవర్ షెడ్, ఆర్చి, బోర్‌వెల్, లైటింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకపల్లి, సైదాపూర్ మార్కెట్ యార్డులో రూ.30 లక్షలతో 100 మెట్రిక్ టన్నుల గోదాం, నూతన మార్కెట్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు.చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లిలో రూ.30 లక్షలతో వెటర్నరీ సబ్ సెంటర్, రూ.16 లక్షలతో వివో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే చిగురుమామిడి మండల కేంద్రంలో రూ.20 లక్షలతో ప్రాథమిక పశువైద్య కేంద్రానికి అదనపు గదులు, మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు.

ఆయచోట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సైదాపూర్ మార్కెట్ యార్డు అభివృద్ధి ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ఆధునికీకరణ చేపడుతున్నామని చెప్పారు. ఐదు ఎకరాల స్థలం అందుబాటులో ఉంటే ఏ గ్రామంలోనైనా సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. రైతులు అధిక ఆదాయం ఇచ్చే పంటల వైపు మళ్లాలని సూచించిన మంత్రి, సమీపంలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉన్నందున ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో ఆయిల్ పామ్ విస్తరణకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఆరుతడి పంటలను కూడా విస్తృతంగా సాగు చేయాలని సూచించారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాల మధ్య రహదారి అనుసంధానం, 29 వంతెనల నిర్మాణానికి రూ.33 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందుర్తి–ములకనూరు వంతెనలు త్వరలో పూర్తవుతాయని, కరీంనగర్ ఫోర్‌లైన్ రోడ్డు పనులు వేగవంతమవుతున్నాయని చెప్పారు.

గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణ వేగంగా కొనసాగుతోందని, త్వరలో సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలకే ప్రాధాన్యం ఇస్తూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ఆర్డీవోలు షర్మిల, జల కుమారి జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News