ప్రతిపక్షం, ఆగస్టు 07: తెలంగాణలో ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల ఫీజుల విషయంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన పూర్తి ఫీజుల వివరాలను ప్రతి పాఠశాల తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది.
విద్యాశాఖ ఆదేశాల ప్రకారం, ఫీజుల నిర్మాణాన్ని పాఠశాల నోటీస్ బోర్డుపై, అధికారిక వెబ్‌సైట్‌లో, అలాగే పాఠశాల విద్యాశాఖ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. తల్లిదండ్రులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా పారదర్శకత పాటించాలని సూచించింది.
ఈ నిబంధనలను అమలు చేయని ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలను వెల్లడించని పాఠశాలలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
పాఠశాలలు ఫీజుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా తల్లిదండ్రులకు స్పష్టమైన సమాచారం అందడంతో పాటు, అధిక ఫీజులపై వచ్చే ఫిర్యాదులను తగ్గించడమే ఈ నిర్ణయం లక్ష్యంగా విద్యాశాఖ పేర్కొంది.

















