[t4b-ticker]

‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ పేరుతో సైబర్ మోసం.. అమ్మాయిలు జాగ్రత్త!

ప్రతిపక్షం, ఆగస్టు 08: ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక సైబర్ మోసం దాగి ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ‘ఆగస్టు 1 ప్రత్యేక ఆఫర్.. 50 శాతం తగ్గింపు’ అంటూ సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్నట్లు తెలిపారు.

ఆకర్షణీయమైన యువకుల ఫొటోలను ఉపయోగించి గంట, పది గంటల ప్యాకేజీలంటూ ప్రకటనలు ఇస్తున్నారని, ఆసక్తి ఉన్నవారు నేరుగా సందేశం పంపాలని కోరుతూ యువతులను మోసగాళ్లు తమ వలలోకి లాగుతున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. అనంతరం వ్యక్తిగత వివరాలు, డబ్బులు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇలాంటి అనుమానాస్పద ప్రకటనలు, ఆఫర్లకు స్పందించకుండా అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, సందేశాలను తెరవకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

ఇలాంటి సైబర్ మోసాలకు గురైన వారు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.

Spread the love

Related News

Latest News