[t4b-ticker]

SIR సర్వే ఎఫెక్ట్.. హైదరాబాద్‌లోనే 40 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం!

ప్రతిపక్షం, ఆగస్టు 09: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే దాదాపు 40 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన పలువురు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఉపాధి, విద్య, వ్యాపారం కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్న వలస ఓటర్లలో కొంతమంది తమ సొంత రాష్ట్రాల్లోనే ఓటు హక్కును కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీంతో హైదరాబాద్‌లోని ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న వారి వివరాలు ప్రత్యేక సవరణ ప్రక్రియలో ధ్రువీకరించబడకపోతే పేర్లు తొలగిపోయే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రత్యేక సవరణ ప్రక్రియలో సుమారు 44 లక్షల ఓట్లు తొలగించినట్లు సమాచారం. ఇదే తరహాలో తెలంగాణలోనూ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్ల విషయంలో ఎన్నికల అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో వలస జనాభా ఉండటంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకే నగరంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు జాబితా నుంచి తొలగే అవకాశం ఉండటంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అయితే ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితా రూపుదిద్దుకోనుంది.

తమ ఓటు హక్కును కొనసాగించాలనుకునే అర్హులైన ఓటర్లు నిర్ణీత గడువులోపు సంబంధిత అధికారులను సంప్రదించి తమ వివరాలు సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది.

Spread the love

Related News

Latest News