ప్రతిపక్షం, ఆగస్టు 09: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ప్రాణాంతక బాక్టీరియా కలకలం రేపుతోంది. విబ్రియో వల్నిఫికస్‌గా పిలిచే ఈ బాక్టీరియా కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 9 మంది ఇన్ఫెక్షన్‌కు గురికాగా.. వారిలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో తీరప్రాంతాల్లో ఈ బాక్టీరియాపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.
విబ్రియో వల్నిఫికస్ సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లోని వెచ్చని ఉప్పునీటిలో కనిపిస్తుంది. శరీరంపై ఉన్న గాయాలు లేదా పుండ్లు కలుషిత నీటికి తాకినప్పుడు బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలాగే సరిగ్గా ఉడికించని సముద్ర ఆహారం తీసుకోవడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ బాక్టీరియా సోకినప్పుడు కొందరిలో గాయం చుట్టుపక్కల తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని సాధారణంగా ‘మాంసాన్ని తినే బాక్టీరియా’ అని పిలుస్తుంటారు. అయితే ఇది నిజంగా మాంసాన్ని తింటుందనే అర్థం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, కాలేయ సంబంధిత సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.
తీర ప్రాంతాల్లో గాయాలతో ఉన్నవారు ఉప్పునీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సముద్ర ఆహారాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని సూచిస్తున్నారు. గాయం చుట్టూ అకస్మాత్తుగా వాపు, ఎర్రబడటం, తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.





























