ప్రజాస్వామ్యానికి చీకటి దినం: వీ.హన్మంతరావు

ప్రతిపక్షం, జూన్ 10: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ప్రభుత్వ సలహాదారు వీ. హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ఘటనను ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు.

మీనాక్షి నటరాజన్‌పై ప్రస్తావిస్తున్న కేసుకు సంబంధించిన సమన్లు ఆమెకు అందలేదని, కేసు గురించి అధికారిక సమాచారం లేకపోతే అఫిడవిట్‌లో ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని నామినేషన్‌ను తిరస్కరించడం అన్యాయమని అన్నారు.

స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సమయంలో వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని హనుమంతరావు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే విధంగా వ్యవహరించడం దేశానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు.

మహిళా నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని కొందరు సహించలేకపోతున్నారని విమర్శించిన ఆయన, మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రజాస్వామ్య, న్యాయపరమైన మార్గాల్లో పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ ఘటన ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక ప్రశ్నలను లేవనెత్తిందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి సంస్థపై ఉందని హనుమంతరావు పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News