ప్రతిపక్షం, ఆగస్టు 04: తెలంగాణలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్‌లో మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
రాష్ట్రంలోని 26 వేల చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు. మత్స్యకారులకు బీమా సౌకర్యం, మోపెడ్ల పంపిణీ, రిటైల్ ఫిష్ షాపుల ఏర్పాటు కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి మత్స్య సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సమస్యలను నేరుగా పరిష్కరిస్తామని వెల్లడించారు.
మత్స్యకారుల పెండింగ్ బకాయిల విడుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించడంతో పాటు పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో చేపలను చేర్చే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
సభ్యత్వ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని, కోహెడలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ మార్కెట్ ద్వారా ఆన్‌లైన్‌లో చేపల విక్రయాలకు అవకాశం కలుగుతుందని చెప్పారు.
ఇప్పటికే రూ.1.34 కోట్ల బీమా క్లెయిమ్‌లను ప్రభుత్వం విడుదల చేసిందని, మత్స్య సహకార సంఘాల అధ్యక్షుల ప్రోటోకాల్ అంశాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి, ఆదాయ పెంపు కోసం అన్ని విధాలుగా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

















