ప్రతిపక్షం, ఆగస్టు 05: తెలంగాణలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను పార్లమెంట్లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పాలమూరు–రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన సానుకూల తీర్పును ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇక ఆలస్యం చేయకుండా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనుమతుల జాప్యం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులు నిలిచిపోయాయని, దీంతో వ్యయం మరింత పెరుగుతోందని కేంద్ర మంత్రికి వివరించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోతల పథకంపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుపై రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. ప్రజల సాగునీటి అవసరాలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పర్యావరణ అనుమతులు లభిస్తే నిర్మాణ పనులు వేగవంతమై లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకమని, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే అనుమతులు జారీ చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేమ్ నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, రామసహాయం రఘురాం రెడ్డి, పోరిక బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, డాక్టర్ కడియం కావ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


















