[t4b-ticker]

వచ్చే ఏడాది నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన

ప్రతిపక్షం, ఆగస్టు 05: భారతదేశంలో ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్ల ప్రవేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. పాలిమర్ బ్యాంక్ నోట్లను వివిధ వాతావరణ, వినియోగ పరిస్థితుల్లో పరీక్షించిన అనంతరం, అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే 2027 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు.

ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన గవర్నర్, పాలిమర్ నోట్లు ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో విజయవంతంగా వినియోగంలో ఉన్నాయని చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పలు దేశాలు ఈ నోట్లను ఉపయోగిస్తున్నాయని, వాటి పనితీరు మెరుగ్గా ఉందని వివరించారు.

పేపర్ కరెన్సీతో పోలిస్తే పాలిమర్ నోట్లు మరింత మన్నికగా ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే వీటి జీవితకాలం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని గవర్నర్ తెలిపారు. దీంతో నోట్లు తరచూ ముద్రించాల్సిన అవసరం తగ్గడంతో పాటు, దీర్ఘకాలంలో ముద్రణ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందన్నారు.

అంతేకాకుండా పాలిమర్ నోట్లు తేమ, నీరు, మురికి ప్రభావానికి తక్కువగా గురవుతాయని, చినిగిపోవడం లేదా త్వరగా పాడవడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. భద్రతా ప్రమాణాల పరంగా కూడా ఇవి మరింత మెరుగ్గా ఉండి, నకిలీ నోట్ల తయారీని నియంత్రించడంలో ఉపయోగపడతాయని ఆర్‌బీఐ అభిప్రాయపడుతోంది.

పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత దశలవారీగా పాలిమర్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకురావాలని ఆర్‌బీఐ యోచిస్తోంది. వీటి విలువలు, విడుదల తేదీలు, ఇతర సాంకేతిక వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News