[t4b-ticker]

త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్

  • పౌరుల డేటా భద్రతకు బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీ
  • రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ
  • “ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్ (తెలంగాణ)”లో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, ఆగస్టు 07: త్వరలోనే రాష్ట్రంలో ‘డిజిటల్ అసెంబ్లీ’, ‘డిజిటల్ కౌన్సిల్’ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పౌర సేవల్ని మరింత సమర్థవంతంగా… ప్రజల ముంగిటకే చేర్చేలా ఏఐ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీలకు పాలనలో పెద్ద పీట వేస్తున్నామన్నారు. గవ్ కనెక్ట్ (GOVconnect), ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీసేవ) సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన “ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్ (తెలంగాణ)”ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాలనలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. డిజిటల్ క్యాబినేట్, 20 ప్రభుత్వ శాఖలను ఒకే తాటిపైకి తెచ్చేలా రియల్ టైమ్ గవర్నమెంట్ డ్యాష్ బోర్డు, దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్స్ఛేంజ్, వాట్సాప్ ద్వారా పౌర సేవల డెలివరీ, మీ టికెట్ లాంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణల ద్వారా డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిపామన్నారు. పౌరుల డేటా భద్రతకు పెద్దపీట వేసేలా త్వరలోనే బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీకి శ్రీకారం చుడతామన్నారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు టీ ఫైబర్ ద్వారా హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పౌర సేవలను నేరుగా వారి ఇంటి ముంగిటకే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయిలో పేపర్‌లెస్ అడ్మినిస్ట్రేషన్‌ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎంవో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మిత్రా సీఈవో ప్రవీణ్ పరదేశి, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎండీ జీవీఎల్ సత్య కుమార్, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా సీఈవో డా. దేవేష్ త్యాగి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అడిషనల్ సెక్రటరీ సౌరభ్ కె. తివారీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News