ప్రతిపక్షం, ఆగస్టు 09: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యాయత్నం కేసులో జైల్లో ఉన్న తమ బంధువుకు బెయిల్ రావాలన్న ఉద్దేశంతో నలుగురు వ్యక్తులు ఏకంగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని క్షుద్రపూజలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి సమయంలో శ్మశానవాటికలో న్యాయమూర్తి ఫొటోను ఉంచి తాంత్రిక పూజలు చేస్తున్న నలుగురిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా.. మరో ముగ్గురు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని విచారించగా.. ఓ తాంత్రికుడి సలహాతో ఈ పూజలు చేసినట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్న తమ బంధువుకు కోర్టు నుంచి బెయిల్ రావాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు అతడు చెప్పినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. న్యాయవ్యవస్థలో కీలకమైన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.





























