[t4b-ticker]

అసైన్డ్ ఇళ్లు, ప్లాట్లకు విముక్తి.. త్వరలో మార్గదర్శకాలు విడుదల

ప్రతిపక్షం, ఆగస్టు 06, హైదరాబాద్: తెలంగాణలో అసైన్డ్ భూముల్లో నిర్మించిన ఇళ్లు, ప్లాట్ల యజమానులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన గృహ స్థలాలు, గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్లు, ప్లాట్లను నిషేధిత ఆస్తుల జాబితా (22A) నుంచి తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం 22ఏ జాబితాలో ఉండటంతో వేలాది మంది భూ యజమానులు తమ ఇళ్లు, స్థలాలను కొనుగోలు, విక్రయాలు లేదా రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూముల్లో నిర్మించిన ఇళ్లు, ప్లాట్ల వివరాలను అధికారులు సేకరించనున్నారు. అనంతరం ప్రభుత్వం నిర్ణయించే కటాఫ్ తేదీకి ముందు నిర్మించిన ఇళ్లు, స్థలాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం. ఒక నిర్దిష్ట సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ణయించి, ఆ తేదీకి ముందు ఉన్న నిర్మాణాలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తించేలా ప్రభుత్వం విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని వేలాది కుటుంబాలకు ఊరట లభించనుంది. చాలాకాలంగా రిజిస్ట్రేషన్, వారసత్వ బదిలీలు, బ్యాంకు రుణాలు వంటి అంశాల్లో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. దీంతో ఆయా ఆస్తులపై యజమానులకు పూర్తి హక్కులు లభించి లావాదేవీలు సులభతరం కానున్నాయి.

అయితే దీనికి సంబంధించిన తుది నిబంధనలు, అర్హత ప్రమాణాలు, కటాఫ్ తేదీ, అమలు విధానం వంటి అంశాలను ప్రభుత్వం అధికారిక మార్గదర్శకాల ద్వారా వెల్లడించనుంది. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల అనంతరం జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి అర్హులైన ఆస్తులను 22ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News