Dedicated Commission for BC Census in Telangana: రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. కులగణన అంశంలో తెలంగాణ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రేపటిలోగా చర్యలు తీసుకోవాలంటూ ప్రత్యేక కమిషన్ ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వెనుకబడిన కులాల గణనకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.