గల్ఫ్ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ లోపు గల్ఫ్ కార్మికుల కోసం ప్రణాళిక రూపొందిస్తామన్నారు. గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని.. గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డ్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ప్రజా భవన్ లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ఒక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి.. సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. సెప్టెంబర్ 17 లోగా మీ సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత మాది అని హామీనిచ్చారు.
ఫిలిప్పీన్ విధానాలను మేం స్పష్టంగా అధ్యయనం చేసాం.. కార్మికుల హక్కులు కాపాడేందుకు ఆ దేశమే ఇతర దేశాల వ్యవస్థలతో మాట్లాడుతుందన్నారు. కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా అధ్యయనం చేసామని.. ఇప్పటికే గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేసామన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తాం.. పాలసీ డాక్యుమెంట్ పై మీ అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకెళతామని పేర్కొన్నారు.
గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.. ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు తీసుకోబోతున్నామని.. ఏజెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గల్ఫ్ వెళ్లే వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. రైతు బీమాలాగే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మీ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు జీవన్ అన్నకు అవకాశం ఇవ్వండి.. పార్లమెంట్ లో మీ గొంతు వినిపించేందుకు నిజామాబాద్ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు.