షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ప్రతిపక్షం, షాద్ నగర్, మే13: పాలమూరు ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని, అలాగే దేశంలో ప్రజలు రాహుల్ ను ప్రధానిగా కోరుకుంటున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం కేశంపేట మండలంలోని సంగెం, ఎక్లాస్ ఖాన్ పేట, కొత్తపేట, భైర్ ఖాన్ పల్లి, లేమామిడి, నిర్దవెళ్లి గ్రామాలలో పోలింగ్ సరళి ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తుల చేతిలో కేంద్రం బందీ అయిందని, వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉందన్నారు. దేశంలో అదానీ, అంబానీ పాలన సాగుతున్నదని ఆయన మండిపడ్డారు.
మోదీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పతనమవుతున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గడీలపాలన నుంచి విముక్తి కల్పించిన నాయకుడు, పాలమూరు బిడ్డ మన రేవంత్ రెడ్డి అని, రాష్ట్రంలో రేవంత్ పనితీరు భేష్ అంటుండ్రన్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా మారబోతుందన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం బడుగు, బలహీన వర్గాలతో పాటు మైనారిటీ సోదరులు, మహిళలు తమ ఓట్లేసి కృషి చేస్తున్నారన్నారు. అన్ని మండలాలలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో కంటే బాగా కాంగ్రెస్ కు మద్దత్తుగా ప్రజలు నిలుస్తున్నారని ఓటింగ్ సరళిని చూస్తే అర్థమవుతుందన్నారు.