హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి చేరేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలు క్యూకడుతున్నారు. గత పదేళ్లు బీఆర్ఎస్లో ఉండి పలు పదవులు పొందిన నాయకులు ముచ్చటగా వంద రోజులు కూడా ప్రతిపక్షంలో ఉండేందుకు సాహసించడంలేదు. దీనికి తోడు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు విపక్ష పార్టీలకు చెందిన ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లపై విసిరిన ఆకర్స్ మంత్రం బాగా పనిచేస్తున్నది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఆకర్ష్ మంత్రం బాగా పనిచేస్తున్నది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు, గత వారం రోజుల నుంచి గ్రామాల్లో బీఆర్ఎస్కు చెందిన మాజీ సర్పంచ్‌లు, ముఖ్యనేతలతో పాటు ఆ పార్టీ ఎంపీటీసీలకు కాంగ్రెస్ కండువా కప్పుతూనే ఉన్నారు.
బుధవారం నాడు బీఆర్ఎస్ నేత, షాద్‌నగర్ మాజీ మున్సిపల్ చైర్మెన్ అగ్గనూరి విశ్వంతో పాటు చటాన్‌పల్లి కౌన్సిలర్ భర్త కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షాద్‌నగర్ సర్పంచ్‌గా రెండు పర్యాయాలు, చైర్మన్‌గా ఒక పర్యాయం పని చేసిన అగ్గనూరు విశ్వం 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అగ్గనూరు విశ్వం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి అనుచరుడుగా పేరు పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా వీర్లపల్లి శంకర్గెలుపుకు కంకణం కట్టుకొని పనిచేశారు. శంకర్ గెలుపే లక్ష్యంగా ఆయన అంతా తానై ప్రచారం నిర్వహించడంతో పాటు బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు జడ్పీటీసీలను సైతం తన వెంట కాంగ్రెస్ కండువా కప్పించారు.