ప్రతిపక్షం, ఆగస్టు 13: నటి షకీలా ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా గంటల తరబడి మంచంపై పడుకుని ఫోన్ చూడటం వల్ల మెడపై తీవ్ర ప్రభావం పడిందని ఆమె తెలిపారు. ఈ కారణంగా విపరీతమైన మెడ నొప్పితో బాధపడినట్లు వెల్లడించారు. పరిస్థితి తీవ్రం కావడంతో తాజాగా మెడకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు చెప్పారు.
ఈ చికిత్స కోసం సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు షకీలా వెల్లడించారు. ప్రస్తుతం శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్నానని తెలిపారు. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఫోన్ చూడటం వల్లే తనకు ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. దీంతో ఫోన్ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తెలుగు సహా పలు భాషల్లో సినిమాల్లో నటించిన షకీలా తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజా ఘటనతో ఫోన్ను ఎక్కువసేపు వినియోగించే వారిలో ఆరోగ్యంపై ప్రభావం పడే అంశంపై మరోసారి చర్చ మొదలైంది.





























