ప్రతిపక్షం, ఆగస్టు 13: తెలంగాణలో అనుమతి లేకుండా దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. విధులకు హాజరుకాకుండా ఇష్టారాజ్యంగా గైర్హాజరవుతున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా వరుసగా ఏడాది పాటు విధులకు హాజరుకాని ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంది. అలాగే ఏకంగా ఐదేళ్ల పాటు విధులకు దూరంగా ఉంటే.. వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగా పరిగణించే నిబంధనలను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు, సిబ్బందిపై సకాలంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులపై ఉంటుంది. అయితే సంబంధిత ఉద్యోగుల గైర్హాజరును గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం స్పష్టం చేసింది.
పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, విద్యా బోధనపై ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా విధులకు రాకపోయినా జీతాలు, ఇతర ప్రయోజనాలు పొందే పరిస్థితులకు అడ్డుకట్ట వేయడంతో పాటు పాఠశాలల్లో సిబ్బంది కొరత సమస్యను తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
ఇకపై అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగుల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారినే బాధ్యులను చేస్తామని విద్యాశాఖ హెచ్చరించినట్లు తెలుస్తోంది.





























