ప్రతిపక్షం, ఆగస్టు 14: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించిన గత విచారణను రద్దు చేస్తూ, వ్యవహారాన్ని మళ్లీ మొదటి నుంచి పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5న చేపట్టనున్నట్లు తెలిపింది.
ఓటుకు నోటు కేసును ఎన్నికల చట్టాల కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేయడం చెల్లదని పేర్కొంటూ 2021లో సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో జరిగిన ప్రక్రియను రద్దు చేసి, కేసును మొదటి నుంచి విచారించేందుకు నిర్ణయించింది. దీంతో కేసులో తదుపరి పరిణామాలపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
సెప్టెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణలో ఈ కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై సుప్రీంకోర్టు మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.





























