ప్రతిపక్షం, ఆగస్టు 14: భారతదేశంలోని జెన్‌జీ యువత అంటే ప్రయాణాలు, వినోదం, కొత్త అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని సాధారణంగా భావిస్తుంటాం. అయితే వారి వాస్తవ ఖర్చుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. జీతం పొందుతున్న జెన్‌జీ యువత తమ నెలవారీ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని నిత్యావసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే ఖర్చు చేస్తున్నట్లు సాలరీ సే అధ్యయనం తెలిపింది.
5.2 లక్షలకు పైగా జీతం పొందుతున్న జెన్‌జీ వినియోగదారుల లక్షలాది యూపీఐ లావాదేవీలను విశ్లేషించి ఈ అధ్యయనం నిర్వహించినట్లు సమాచారం. ఇందులో భాగంగా యువత నెలవారీ ఖర్చుల విధానాన్ని పరిశీలించగా.. ప్రయాణాలకు వారు కేవలం 5 శాతం మాత్రమే కేటాయిస్తున్నట్లు తేలింది. దీంతో జెన్‌జీ యువత తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని ప్రయాణాలు, విలాసాలకు ఖర్చు చేస్తారనే అభిప్రాయానికి ఈ గణాంకాలు భిన్నంగా ఉన్నాయి.
బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లకే అధిక ఖర్చు
జెన్‌జీ యువత నెలవారీ ఖర్చుల్లో బిల్లులు, సబ్‌స్క్రిప్షన్ల వాటా అత్యధికంగా 20.1 శాతంగా ఉంది. ఆ తర్వాత కిరాణా సరుకులకు 15.7 శాతం, ఆర్థిక సేవలకు 12.2 శాతం, షాపింగ్‌కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది.
ఈ ఐదు విభాగాలను కలిపితే జెన్‌జీ నెలవారీ ఖర్చుల్లో 70 శాతానికి పైగా రోజువారీ అవసరాలకే వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. అంటే డిజిటల్ ప్రపంచంలో పెరిగిన ఈ తరం కూడా తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని అవసరాలకే కేటాయిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
వినోదానికీ ప్రత్యేక స్థానం
వినోదం, డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ల విషయంలోనూ జెన్‌జీ యువత వెనుకడుగు వేయడం లేదు. వినోద సబ్‌స్క్రిప్షన్లలో జియో హాట్‌స్టార్ వాటా 12.4 శాతంగా ఉండగా, నెట్‌ఫ్లిక్స్ 10.7 శాతం, స్పాటిఫై 5.6 శాతం వాటాను కలిగి ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
వయసు పెరిగేకొద్దీ బాధ్యతలు
18–23 ఏళ్ల జెన్‌జీ, 24–29 ఏళ్ల జెన్‌జీ ఖర్చులను పోల్చి చూడగా ఆసక్తికరమైన మార్పులు కనిపించాయి. రెండు వయసు వర్గాల్లోనూ విచక్షణతో చేసే ఖర్చు 32 శాతంగా ఉన్నప్పటికీ.. అవసరాల కోసం చేసే ఖర్చు మాత్రం వయసు పెరిగే కొద్దీ పెరుగుతోంది.
18–23 ఏళ్ల యువత అవసరాల కోసం చేసే ఖర్చు 50 శాతం ఉండగా, 24–29 ఏళ్ల వయసులో అది 59 శాతానికి పెరిగింది. ఉద్యోగ జీవితం ప్రారంభమైన తర్వాత కుటుంబ, ఆర్థిక బాధ్యతలు పెరగడం, బిల్లులు, కిరాణా, ఆహారం, ఆర్థిక సేవల వంటి ఖర్చులు అధికం కావడం ఇందుకు కారణంగా అధ్యయనం పేర్కొంది.
డిజిటల్ చెల్లింపుల ప్రభావం
యూపీఐ, ఆటోపే వంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు జెన్‌జీ ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని సాలరీ సే సహ వ్యవస్థాపకుడు పీయూష్ బగారియా తెలిపారు. బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు, ఇతర ఆర్థిక చెల్లింపులను డిజిటల్ విధానంలో సులభంగా నిర్వహించే అవకాశం ఉండటంతో ఈ తరంలో ఆన్‌లైన్ లావాదేవీలు విస్తృతంగా పెరిగాయని పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే.. ప్రయాణాలు, వినోదంపై ఆసక్తి ఉన్నప్పటికీ భారత జెన్‌జీ యువత నెలవారీ ఖర్చుల్లో ప్రధాన వాటా నిత్యావసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే వెళ్తోంది. ప్రయాణాలకు కేవలం 5 శాతం ఖర్చు చేస్తుండటం ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన అంశంగా మారింది.





























