ప్రతిపక్షం, శామీర్ పేట్ మండలం, ఆగస్టు 17: విశ్వ విశ్వాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్‌మెంట్ (వీవీఐఎస్ఎం) తన 21వ పీజీడీఎం బ్యాచ్‌ను సోమవారం అధికారికంగా ప్రారంభించింది. క్యాంపస్‌లో ఉన్న సీకే ప్రహ్లాద్ హాల్‌లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం విశ్వ విశ్వాని విద్యాసంస్థల అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన జీఎస్ఎస్ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలలో భావోద్వేగ మేధస్సు, స్వీయ మూల్యాంకనం, వ్యవస్థాపక దృక్పథం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
ఈ సందర్భంగా వీవీఐఎస్ఎం డీన్ మరియు డైరెక్టర్ డాక్టర్ వీ జయశ్రీ వి మాట్లాడుతూ విద్యాపరమైన విజయాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, పరివర్తన అంతే ముఖ్యమన్నారు. విద్యార్థులు వ్యక్తిగత ప్రతిభను మెరుగుపరుచుకుంటూ సాధారణ ప్రమాణాలకు మించి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. జిజ్ఞాసతో ఈ కోర్సును ప్రారంభించాలన్నారు. భవిష్యత్తుకు సిద్ధపడే సమర్థవంతమైన నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డయాకేర్ సొల్యూషన్స్ హెల్త్‌కేర్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మిశ్రా గారు మాట్లాడుతూ పదిహేడు ఏళ్ల క్రితం ఇదే వీవీఐఎస్ఎం పీజీడీఎం పూర్వ విద్యార్థినన్నారు.
ఈ సంస్థ అందించే విద్య ఎలాంటి అద్భుతమైన అవకాశాలను తెచ్చి పెడుతుందో వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మైండ్స్‌స్పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకురాలు, యాక్సెంచర్, ఐబీఎం వంటి సంస్థల్లో మూడు దశాబ్దాలకు పైగా గ్లోబల్ కన్సల్టింగ్ అనుభవం లక్ష్మీ నాయర్ గారు మాట్లాడుతూ ఆత్మపరిశీలన, బలాలు గుర్తించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు తట్టుకునే శక్తిని అలవర్చుకోవడం గురించి విలువైన సూచనలు చేశారు. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన లక్షణాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.





























