ప్రతిపక్షం, ఆగస్టు 17: తెలంగాణలో పలుచోట్ల వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రానున్న 1 నుంచి 2 గంటల్లో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే సాయంత్రం 6 గంటల వరకు మహబూబాబాద్, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
అయితే మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉండటంతో వర్ష సూచనపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. ఒకే సమయంలో కొన్ని జిల్లాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కనిపించే పరిస్థితి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షం, ఈదురుగాలులు లేదా పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.





























