Trending Now

ధాన్యం కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలి : మాజీ మంత్రి కేటీఆర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి.. ధాన్యం కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంలో పడింది. రైతులు తమ ధాన్యం ప్రభుత్వం కొంటలేదని బాధపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. రైతన్నలు తీవ్ర కష్టాల్లో బాధపడుతున్నారన్నారు. తమ ధాన్యం కొనే నాథుడు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలో ఆలస్యం కావటం, అకాల వర్షాలు కురుస్తుండటంతో మొత్తం ధాన్యం వర్షాల పాలవుతోంది. 25 రోజులైన కూడా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో కొనే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అయిపోయిన నేపథ్యంలో రాజకీయాలను పక్కనపెట్టి రైతన్నలను ఆదుకోవాలని.. ధాన్యం తరుగు విషయంలో కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో రైతుకు అన్యాయం చేయకుండా తరుగు లేకుండా రైతన్నలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతన్నలు ఆందోళనలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిరసనలు చేశారన్నారు. ఈ ప్రభుత్వం స్పందించకుంటే రైతన్నల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ ఎక్కాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. రైతులకు బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ అధినాయకుడు కేసీఆర్ అండగా ఉంటారని స్పష్టంచేశారు. మీ ధాన్యం కొనుగోళ్లతో పాటు 500 రూపాయల అదనపు బోనస్, రుణమాఫీ జరిగే వరకు రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని వారికి మేము అండగా ఉంటామని హామీనిచ్చారు.

వరంగల్- ఖమ్మం -నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతిసారి మా పార్టీనే గెలిచింది. ఈ మూడు జిల్లాల్లోని విద్యావంతులు తిరిగి మరొకసారి మా పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి గెలుపు కట్టబెడతారని నమ్మకం ఉంది. మా అభ్యర్థి రాకేష్ రెడ్డి బిట్స్ పిలానిలో ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చిన విద్యావంతుడు, ఉత్సాహవంతుడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మోసం చేసిన తీరును ఈ మూడు జిల్లాల్లో ఉన్న నాలుగు లక్షల 70 వేల నిరుద్యోగ యువత గుర్తించాలి. 50 వేల పోస్ట్ లతో మెగా డీఎస్సీ అని చెప్పి దగా చేసిన తీరును నిరుద్యోగులు ఇప్పటికే గుర్తించారని తెలిపారు. మేము గతంలో ఇచ్చిన డీఎస్సీ నే ఈ ప్రభుత్వం మరోసారి తిరిగి ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ అన్నారు. దానిపైన ఇప్పటిదాకా ఏ విషయాన్ని తేల్చటం లేదు. గతంలో పరీక్షలకు ఎలాంటి ఫీజులు తీసుకోమని చెప్పి ఈరోజు ప్రతి విద్యార్థి నుంచి రూ. 2 వేలు తీసుకుంటున్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మేము ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బుద్ది చెప్పాలి. రెండు లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయాలంటే.. ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సావంతుడు యువకుడైన వ్యక్తి శాసన మండలికి పంపాలన్నారు.

24 గంటలు కష్టపడుతున్న విద్యుత్ సంస్థ ఉద్యోగుల పైన అభాండాలు వేస్తున్నారు. 7700 మెగావాట్ల నుంచి 20వేల మెగావాట్లకు తీసుకువెళ్లిన విద్యుత్ సంస్థల ఉద్యోగుల అద్భుతమైన పనితీరును కూడా నిందిస్తున్నారు. రేవంత్ రెడ్డి కామన్ సెన్స్ లేకుండా తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్ సంస్థల ఉద్యోగులను తిడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 లక్షల 87 వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు అని చెప్పింది. కాంగ్రెస్ చెప్పినట్టు ఏడు లక్షల కోట్ల అప్పు అన్నది దివాలాకోరు ప్రచారం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం అప్పు పైన తప్పుడు ప్రచారం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం పైన బీజేపీ ఆలోచనలు వేరే తీరుగా ఉన్నాయి. వారి కుట్రలను జూన్ 4 తర్వాత అర్థం చేసుకుంటారన్నారు.

Spread the love

Related News

Latest News