పిల్లల ఆన్‌లైన్‌ భద్రతకు ప్రభుత్వం పూర్తి అండ: సీఎం రేవంత్‌

ప్రతిపక్షం, అక్టోబర్ 03: పిల్లలు ఆన్‌లైన్‌ వేధింపులు, సైబర్‌ నేరాలకు గురికాకుండా వారికి అవసరమైన భద్రత, సంరక్షణ కల్పించేందుకు న్యాయ సేవల ప్రాధికార సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. డిజిటల్‌ వేదికలపై చిన్నారుల రక్షణ కోసం రూపొందిస్తున్న వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు, న్యాయ సేవల సంస్థలు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.

జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘డిజిటల్‌ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం.. ఆన్‌లైన్‌ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం’ అనే అంశంపై దక్షిణాది ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొని పిల్లల భద్రత, సైబర్‌ నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయ సహాయం వంటి అంశాలపై మాట్లాడారు.

మహిళలు, పిల్లల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం పోలీసు వ్యవస్థతో పాటు భరోసా కేంద్రాలు, బాలల రక్షణ విభాగాలు, బాలల సంక్షేమ కమిటీలు, ప్రత్యేక న్యాయస్థానాలు, న్యాయ సేవల సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. బాధిత మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం వేగంగా అందేలా వివిధ వ్యవస్థలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు.

భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకే చోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, మానసిక సలహా వంటి సేవలు అందిస్తున్నామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలి బాలల అనుకూల న్యాయస్థానాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పిల్లలకు అనుకూలమైన వాతావరణంలో న్యాయ ప్రక్రియ కొనసాగించేలా ఇటువంటి వ్యవస్థలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

సైబర్‌ నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు పోలీసు శాఖలోని మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో షీ-భరోసా సైబర్‌ ప్రయోగశాలలు పనిచేస్తున్నాయని సీఎం తెలిపారు. సైబర్‌ నేరాలపై చిన్నారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు సైబర్‌ యాప్‌ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఎదురయ్యే మోసాలు, వేధింపులు, ప్రమాదాలను ముందుగానే గుర్తించేలా విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థులను సైబర్‌ రాయబారులుగా తీర్చిదిద్దుతూ వారి తోటి విద్యార్థులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పిల్లలు ఒకరినొకరు అప్రమత్తం చేసుకునేలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పిల్లల రక్షణ విషయంలో కేవలం ఒక శాఖతోనే ఫలితాలు సాధ్యం కావని, పోలీసు శాఖ, విద్యాశాఖ, న్యాయ సేవల సంస్థలు, బాలల రక్షణ వ్యవస్థలు, తల్లిదండ్రులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

పిల్లలకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించడం వరకు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ న్యాయ సేవల ప్రాధికార సంస్థ పాఠశాల విద్యాశాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. దీని ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు వారి చట్టపరమైన హక్కులు, అందుబాటులో ఉన్న న్యాయ సహాయం గురించి అవగాహన కల్పిస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు మూడు వేల మందికి పైగా బాలల రక్షణ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

పిల్లలు సైబర్‌ నేరాల వలలో చిక్కుకోకుండా తల్లిదండ్రులను కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పిల్లలు ఆన్‌లైన్‌లో ఎదుర్కొనే సమస్యలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పిల్లలను తప్పుబట్టకుండా వారికి అండగా నిలవాలని అన్నారు. భయపెట్టడం లేదా మందలించడం కంటే పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యను తెలుసుకోవడం, అవసరమైన మార్గదర్శకత్వం అందించడం ముఖ్యమని పేర్కొన్నారు.

సైబర్‌ నేరాలకు సంబంధించి ఫిర్యాదుల కోసం 1930 నంబర్‌ను, పిల్లలకు సంబంధించిన అత్యవసర సహాయం కోసం 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ను గుర్తుంచుకోవాలని సీఎం సూచించారు. సైబర్‌ మోసం లేదా ఇతర ఆన్‌లైన్‌ నేరాలకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా సంబంధిత వ్యవస్థలను సంప్రదించడం ద్వారా నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు.

పిల్లల రక్షణ విషయంలో న్యాయం అంటే కేవలం నేరానికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడటం మాత్రమే కాదని రేవంత్‌ రెడ్డి అన్నారు. బాధితుల జీవితాన్ని తిరిగి నిలబెట్టడం, వారి గౌరవాన్ని పునరుద్ధరించడం కూడా న్యాయంలో భాగమేనని చెప్పారు. ముఖ్యంగా పిల్లలు కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించేందుకు అవసరమైన సహాయం అందించడమే నిజమైన న్యాయం అని పేర్కొన్నారు. న్యాయ సేవల ప్రాధికార సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు అత్యంత ప్రాధాన్యమైన సైబర్‌ భద్రత అంశాన్ని దక్షిణాది ప్రాంతీయ సదస్సు ప్రధాన అంశంగా ఎంచుకోవడం అభినందనీయమని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌ను సదస్సుకు వేదికగా ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో జరిగే చర్చలు, వెలువడే సూచనలు, సిఫారసులు దేశవ్యాప్తంగా పిల్లల రక్షణకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సదస్సుకు కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావాల్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌, జస్టిస్‌ అలోక్‌ అరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, మాజీ న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు.

సదస్సు సందర్భంగా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సిద్ధం చేసిన సంచార లోక్‌ అదాలత్‌ వాహనాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర మంత్రి, న్యాయమూర్తుల సమక్షంలో ప్రారంభించారు. న్యాయ సహాయం అవసరమైన ప్రజలకు సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.

Spread the love

Related News

Latest News