[t4b-ticker]

22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక భరోసా

ప్రతిపక్షం, ఆగస్టు 13: హైదరాబాద్‌ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.. నిషేధిత జాబితాలో ఉన్న భూముల హక్కుదారులకు కీలక భరోసా ఇచ్చారు. ఏదైనా కారణంతో తమ భూములు నిషేధిత జాబితా 22ఏలో చేరాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హక్కుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్థానిక భూముల సమస్యను ప్రస్తావించిన సీఎం.. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి మిగిలిన భూములకు సర్వే నంబర్ల ఆధారంగా బై నంబర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.

కోర్టు కేసుల కారణంగా ఒక సర్వే నంబర్‌లోని మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేర్చిన సందర్భాలు ఉన్నాయని సీఎం వివరించారు. అయితే వివాదంలో ఉన్న భూమిని పక్కనపెట్టి, మిగిలిన భూములకు బై నంబర్లు కేటాయించి హక్కుదారులకు ఇబ్బందులు లేకుండా పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. భూములు కొనుగోలు చేసిన హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

కూకట్‌పల్లికి ప్రత్యేక ప్రాధాన్యం

కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబుకు సీఎం సూచించారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. కూకట్‌పల్లి ప్రజల అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

సంక్షేమ పథకాలను వివరించిన సీఎం

తమ ప్రభుత్వం గత పాలనలో అమలైన సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేయకుండా, అదనంగా మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 3.28 కోట్ల మంది ప్రజలకు ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.

మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఉద్యోగాలు, ఉపాధి, విద్య కోసం ప్రయాణించే మహిళలకు నెలకు వేల రూపాయల వరకు ఆదా అవుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ పథకం కోసం ఆర్టీసీకి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.12 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు.

స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు రుణ అనుసంధానం కల్పించడంతో పాటు రూ.2,500 కోట్ల వడ్డీని ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వెయ్యి బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని వివరించారు.

అదేవిధంగా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించుకునేందుకు హైదరాబాద్‌లోని శిల్పారామంలో మూడున్నర ఎకరాల స్థలంలో ఇందిరా మహిళా బజార్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం

ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో వివిధ శాఖల్లో సుమారు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎం తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

కూకట్‌పల్లిలో వందల కోట్ల రూపాయల విలువైన 11 ఎకరాల స్థలంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశలో కీలక అడుగు అని సీఎం పేర్కొన్నారు. నగరంలో నిరుపేదలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే వారికి సొంత ఇళ్లు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు.

పేదలకు ఉచిత స్థలం.. నిర్మాణంలో భాగస్వామ్యం

నిరుపేదల కోసం నిర్మించే ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. కొత్తగా నిర్మించే ఇళ్లకు స్థలాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణ వ్యయంలో లబ్ధిదారులు కొంత మొత్తాన్ని భరిస్తే, నిర్మాణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించే హక్కు వారికి ఉంటుందని వివరించారు.

కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పేదలు నివసిస్తున్నారని సీఎం తెలిపారు. ఉపాధి కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన పేదలకు కూడా మంచి ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ప్రజల సౌలభ్యం కోసమే సైబరాబాద్ కమిషనరేట్

గతంలో ఒక పని కోసం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ తదితర కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని సీఎం గుర్తుచేశారు. ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశామని వివరించారు.

తెలంగాణను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం తాను నిరంతరం పనిచేస్తానని, మంచి చేయాలనే చిత్తశుద్ధి, మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు రోజుకు 18 గంటలు పనిచేసే శక్తిని దేవుడు తనకు ఇచ్చారని పేర్కొంటూ ప్రజల ఆశీర్వాదం కోరారు.

Spread the love

Related News

Latest News