ప్రతిపక్షం, ఆగస్టు 15: హైదరాబాద్‌లో ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. అతడి భార్యతో కలిసి ఓ వ్యక్తి పరారైన ఘటన నారపల్లిలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తికి చెందిన దాసు, కవిత దంపతులు నారపల్లిలో నివాసం ఉంటున్నారు. సుమారు రెండేళ్ల క్రితం కవితకు గాయం కావడంతో ఆమె కాలును తొలగించాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆమె ఇంటికే పరిమితమై జీవిస్తోంది.
ఇదే సమయంలో దాసు పనిచేసే ప్రాంతంలో కరీమ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు ఎవరూ లేరని, అనాథనని కరీమ్ చెప్పడంతో దాసు అతడిపై జాలి చూపించాడు. సుమారు ఐదు నెలల క్రితం అతడిని తన ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాడు.
ఇంట్లో ఉంటున్న కరీమ్.. కవితతో చనువుగా మెలిగేవాడని దాసు పోలీసులకు తెలిపాడు. అయితే ఈ పరిచయం చివరకు మరింత దూరం వెళ్లినట్లు తెలుస్తోంది. ఆగస్టు 12న కవిత, కరీమ్ ఇద్దరూ ఇంటి నుంచి కలిసి వెళ్లిపోయారు. అనంతరం భార్య కనిపించకపోవడంతో దాసు పోలీసులను ఆశ్రయించాడు.
దాసు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కవిత, కరీమ్ ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. వారు ఎక్కడికి వెళ్లారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.





























