ప్రతిపక్షం, ఆగస్టు 16, హైదరాబాద్: నగరంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో రిక్షా డ్రైవర్లపై పెరుగుతున్న ఇంధన ఖర్చుల భారాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు **“తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026”**ను అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
ఈ పథకం ద్వారా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడుస్తున్న అర్హత కలిగిన ఆటో రిక్షాలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. పాత ఆటోను పూర్తిగా మార్చాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రిక్ కిట్‌తో రెట్రోఫిట్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, పాత వాహనాన్ని అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.
18,766 ఆటోలకు ప్రయోజనం
రవాణా శాఖ అధికారిక గణాంకాల ప్రకారం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌తో క్రియాశీలంగా ఉన్న 18,766 అర్హత కలిగిన పెట్రోల్, డీజిల్ ఆటోలు ఈ పథకం పరిధిలోకి రానున్నాయి. వీటిలో 11,254 డీజిల్ ఆటోలు, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నట్లు మంత్రి తెలిపారు.
ప్రస్తుతం నగరంలో ప్రయాణికులకు చివరి మైలు రవాణా సౌకర్యాన్ని అందించడంలో ఆటో రిక్షాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అయితే పెట్రోల్, డీజిల్ వినియోగం కారణంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు ఇంధన ధరల పెరుగుదల ఆటో డ్రైవర్ల ఆదాయంపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
పాత ఆటోనే ఎలక్ట్రిక్‌గా మార్చుకునే అవకాశం
ప్రస్తుత ఆటో రిక్షా ఛాసిస్‌ను కొనసాగించాలనుకునే లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ రెట్రోఫిట్మెంట్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకోసం ఏఐఎస్–123 ప్రమాణాలకు అనుగుణంగా ఆమోదం పొందిన ఎలక్ట్రిక్ కిట్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
కిట్ కొనుగోలు, అమరిక, అవసరమైన ప్రామాణిక ఫిట్మెంట్ ఉపకరణాల ఖర్చు కలిపి రూ.1.50 లక్షల వరకు లేదా వాస్తవ వ్యయం–ఈ రెండింటిలో తక్కువ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందించనుంది.
ఎంపానెల్ చేసిన విక్రేతల ద్వారా ఈ కిట్లను అమర్చుకునే అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు తమ అవసరానికి అనుగుణంగా ఫిక్స్డ్ బ్యాటరీ కిట్ లేదా అవసరమైనప్పుడు తొలగించి తిరిగి అమర్చుకునే స్వాపబుల్ బ్యాటరీ కిట్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకూ రూ.1.50 లక్షల సబ్సిడీ
పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోను పూర్తిగా అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించనుంది. ఫ్యాక్టరీలో తయారైన, టైప్ అప్రూవల్ పొందిన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ వీలర్ కొనుగోలుకు రూ.1.50 లక్షల స్థిర సబ్సిడీ అందించనున్నారు.
ఎంపానెల్ చేసిన డీలర్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఎంపిక చేసుకున్న ఎలక్ట్రిక్ ఆటో తుది రహదారి ధర నుంచి సబ్సిడీ మొత్తాన్ని డీలర్ ముందుగానే తగ్గించి వాహనాన్ని లబ్ధిదారుడికి అందించే విధంగా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రూ.200 కోట్లతో భారీ పథకం
ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయింపును ప్రతిపాదించింది. ఈ పథకం సామాజిక వర్గంతో సంబంధం లేకుండా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని అర్హత కలిగిన వాహన యజమానులందరికీ సమానంగా వర్తించే విధంగా రూపొందించినట్లు మంత్రి వివరించారు.
పథకానికి అవసరమైన నిధులను వివిధ సంక్షేమ శాఖల నుంచి సమకూర్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల నుంచి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.200 కోట్లు సమకూర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
మూడు స్థాయిల్లో పర్యవేక్షణ
పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా మూడు స్థాయిల్లో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రస్థాయిలో స్టీరింగ్ కమిటీ, పథకం అమలు కమిటీ, జిల్లా స్థాయి మంజూరు కమిటీల ద్వారా పథకాన్ని పర్యవేక్షించనున్నారు.
రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీకి రోడ్లు–భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అధ్యక్షత వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా, రవాణా శాఖ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
పథకం అమలు కమిటీకి రవాణా శాఖ కమిషనర్ అధ్యక్షత వహిస్తారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, నామినేట్ చేసిన సంక్షేమ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
జిల్లా స్థాయిలో సంబంధిత జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన మంజూరు కమిటీలు పనిచేయనున్నాయి. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జిల్లా రవాణా అధికారి, ఆర్టీవోలు, జిల్లా సంక్షేమ అధికారులు తదితరులు ఇందులో భాగస్వాములుగా ఉంటారు.
కాలుష్య నియంత్రణతో పాటు డ్రైవర్లకు ఆర్థిక ప్రయోజనం
హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోల సంఖ్య పెరగడం ద్వారా వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఇంధన ఖర్చుల నుంచి ఆటో డ్రైవర్లు, యజమానులకు కూడా ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
రోజువారీ ఆదాయంలో గణనీయమైన భాగం ఇంధనం కోసం ఖర్చు చేస్తున్న ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఆర్థికంగా ప్రయోజనకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో నగర ప్రజలకు మరింత పర్యావరణహితమైన ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.
తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాలకు అనుగుణంగా
పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణ అభివృద్ధి, ప్రజా రవాణా ఆధునీకరణతో పాటు ఆటో డ్రైవర్ల ఆర్థిక ప్రయోజనాలను సమన్వయం చేస్తూ ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌ను స్వచ్ఛమైన గాలి, తక్కువ కాలుష్యం, సుస్థిర ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని 18,766 ఆటోలకు ప్రయోజనం, ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం, పథకం కోసం రూ.200 కోట్ల బడ్జెట్ వంటి అంశాలతో ఈ పథకం రాష్ట్ర పట్టణ రవాణా రంగంలో కీలక మార్పుకు దారితీసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.





























